ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో కిమ్స్‌లో చేరారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి  డైరెక్టర్‌గా సేవలందించిన కాకర్ల సుబ్బారావు..1925 జనవరి 25న  కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు చల్లపల్లి, కాలేజీ  విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి కాకర్ సుబ్బారావు డాక్టర్‌ పట్టా పొందారు.

1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత  వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక స్కాలర్ షిప్ తో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆస్పత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో భారత దేశానికి  తిరిగి వచ్చి.. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు.2000 సంవత్సరంలో పద్మశ్రీ అందుకున్నారు.